కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో ఓ యువకుడిని కడతేర్చారు. కుటుంబం పరువు, మర్యాద, గౌరవం అంతా మంట గలిపాడని భావించి ఈ దురాగతానికి పాల్పడ్డారు. హైదరాబాద్ తిరుమలగిరిలో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.
అల్వాల్ వెంకటాపురానికి చెందిన నంద కిశోర్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. పెద్దకమేళ ప్రాంతానికి చెందిన అశ్వినితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. పెద్దల్ని ఎదిరించి ఈ జంట మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి చారువాస్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, అశ్విని తల్లికి, ఆమె బంధువులకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. ‘భర్తని వదిలేసేయ్.. నీకు మరో పెళ్లి చేస్తాం’ అంటూ అశ్వినికి ఆమె పుట్టింటివారితో పాటు బంధువులు తరచూ చెప్పేవారు. ఈ నేపథ్యంలో వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అలిగిన అశ్విని తన రెండేళ్ల కుమారుడిని తీసుకుని పుట్టింటికెళ్లింది. కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడమే కాకుండా.. కుమార్తెని అల్లుడు నందకిశోర్ వేధింపులకు గురిచేస్తున్నాడని బంధువులు భావించారు.
ఈ క్రమంలో పథకం ప్రకారం నందకిశోర్‌ను పెద్దకమ్ముల దగ్గరున్ననిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఆర్మీ స్థలాల్లోకి అశ్విని బంధువులు రమ్మని పిలిపించారు. అక్కడ వారు నందకిశోర్‌తో కలిసి మద్యం సేవించారు. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీశావంటూ వారు గొడవకు దిగారు. బండరాళ్లతో తలపై మోది కర్రలతో కొట్టి చంపేశారు. నంద కిశోర్‌ను బావమరిది మైకెల్ అలియాస్ మహేశ్వర్, అతడి బంధువులే హత్య చేశారని హతుడి తల్లి ఆరోపిస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
0 comments:
Post a Comment