మాటలనే ఆయుధాలను తయారు చేయడానికి ఒక కర్మాగారం అంటూ ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి అంతటి పదునైన కత్తుల్లాంటి డైలాగ్‌లను దుయ్యగలిగేవాడు.. బల్లెంలా విసరగలిగేవాడు.. బాణాల్లా సంధించగలిగే వాడు ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్. మరి వీరిద్దరూ కలిస్తే, రం రుధిరం.. సమరం.. శిశిరం.. అంటూ వెండితెరపై కనిపించే ఆ మేజిక్కే వేరు. అందుకే ఈ కాంబినేషన్‌కు ఎంతో క్రేజ్ ఉంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా చూడాలన్న సగటు అభిమాని కల నెరవేరడానికి పుష్కరకాలం పట్టింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంది? ఫ్యాక్షన్ సినిమాల హవా తగ్గిన నేపథ్యంలో ఆ జానర్లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ ఏ మేరకు అలరించింది? త్రివిక్రమ్ మాటల పదును ఎలా ఉంది? వీర రాఘవుడిగా ఎన్టీఆర్ మరోసారి నట విశ్వరూపం చూపించారా?
కథేంటంటే: వీరరాఘవ (ఎన్టీఆర్) ఫ్యాక్షన్ గొడవల్లో తండ్రి(నాగబాబు)ని కోల్పోతాడు. నాయనమ్మ(సుప్రియ పాతక్) మాటలకు ప్రభావితమై హింసకు, రక్తపాతానికి దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడ అరవింద (పూజాహెగ్డే) పరిచయం అవుతుంది. అరవింద కూడా తన నాయనమ్మ చెప్పినట్లు ‘హింస వద్దు.. రక్తపాతం వద్దు’ అని చెబుతుంటుంది. ఒకసారి అరవిందపై అటాక్ జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి అరవిందను రక్షిస్తాడు వీర రాఘవ. అప్పటి నుంచి అరవిందకు సంరక్షకుడిగా మారతాడు. అనుకోని పరిస్థితుల్లో అరవింద ఇంటికి వెళ్లిన వీర రాఘవకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆమె నేపథ్యం ఏంటి? నాయనమ్మ చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ హింసను, ఫ్యాక్షనిజాన్ని వీర రాఘవ ఎలా అడ్డుకున్నాడు? అన్నదే కథ.
ఎలా ఉందంటే: ‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అన్న పాయింట్‌తో త్రివిక్రమ్ శైలిలో రాసుకున్న కథ ఇది. గతంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నింటికీ భిన్నంగా త్రివిక్రమ్ ఎలా తీస్తాడా? అని అభిమానులు ఎదురుచూశారు. అందుకు తగినట్లుగానే త్రివిక్రమ్ కొత్త అంశాన్ని ఎంచుకున్నారు. ‘అదర్‌సైడ్ ఆఫ్ ఫ్యాక్షనిజం’ అన్నట్లు వేరే కోణం చూపించారు. కత్తి పట్టుకుని బయలుదేరిన భర్త గురించి అతని భార్య, తండ్రి గురించి పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో వాళ్ల కోణంలో చూపించారు. మొదటి ఇరవై నిమిషాల కథ చాలా పకడ్బంధీగా సాగుతుంది. ఎమోషనల్‌గా బాగా డ్రైవ్ చేశాడు. ఈ సినిమాలో ఎమోషన్ కంటెంట్ ఉంటుందని ఒక రకంగా ప్రేక్షకుడిని ముందే సిద్ధం చేశాడు. కథ హైదరాబాద్ చేరిన తర్వాత తేలిక పడుతుంది. హీరో, హీరోయిన్, సునీల్ వీరి మధ్య సన్నివేశాలతో అక్కడక్కడా త్రివిక్రమ్ తన మార్కుని చూపిస్తూ కథను సాఫీగా ముందుకు తీసుకెళ్లాడు.
ద్వితీయార్ధంలో త్రివిక్రమ్లోని అసలు కోణం బయట పడుతుంది. ఈ కథ ద్వారా తను ఏం చెప్పదలుచుకున్నాడో బలంగా, కొన్ని పాత్రల ద్వారా చెప్పించగలిగాడు. ద్వితీయార్ధంలో బాలిరెడ్డి(జగపతిబాబు) పాత్ర కీలకం అవుతుంది. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్రతో ముడిపడిన సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. ప్రీ క్లైమాక్స్ కాస్త సాగదీసినట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో మళ్లీ కథను ఫామ్‌లోకి తీసుకొచ్చాడు దర్శకుడు. ఒక రకంగా ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం. త్రివిక్రమ్ ప్రధాన బలం వినోదం. ఆయన గత చిత్రం ఏది తీసుకున్నా వినోదానికి పుష్కలమైన స్థానం ఉంటుంది. అయితే, ఈ సినిమాలో ఏదైనా కొరవడిందంటే అది వినోదమే. త్రివిక్రమ్ శైలి, ప్రాసలు, పంచ్‌లకు ఎక్కడా చోటు లేదు. హీరోయిజం ఎలివేషన్, మాస్ డైలాగ్‌లు వీటిని దృష్టిలోకి పెట్టుకుని థియేటర్‌కు వెళ్తే కాస్త ఇబ్బంది పడతారు. త్రివిక్రమ్ చాలా రోజుల తర్వాత రాసుకున్న కథ ఏం చెబుతుంది.. ఏం చెప్పాలనుకుంటోంది.. దాన్నే వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ బలాలను చూపిస్తూనే డైలాగుల్లో తనదైన మార్కు సృష్టించే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాలకు క్లాప్స్ పడతాయి. కొన్ని సుదీర్ఘంగా సాగుతాయి. మొత్తంగా ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ తర్వాత పకడ్బంధీగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది.
ఎవరెలా చేశారంటే: కథకు, దర్శకుడు రాసుకున్న వీరరాఘవ ప్రాతకు ఎన్టీఆర్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఇన్ని ఎమోషనల్ సీన్స్ ఎన్టీఆర్ ఎప్పుడూ చేయలేదు. తొలి ఇరవై నిమిషాలు పూర్తిగా ఎన్టీఆరే కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ఆది’, ‘సింహాద్రి’, ‘సాంబ’ చిత్రాల్లో ఉన్నట్లు అగ్రెసివ్‌గా ఎన్టీఆర్ కనిపించకపోవచ్చు. ఆ పాత్రకు మరో కోణం ఉంటే ఎలా ఉంటుందో వీరరాఘవ పాత్ర అలా ఉంటుంది. పూజా హెగ్డే పాత్ర కూడా కథలో కీలకమే. ఒక రకంగా కథానాయకుడి పాత్రలో మార్పు రావడానికి బలంగా దోహదం చేసింది. వెండితెరపై కనిపించే ప్రతి చిన్న పాత్రనూ చాలా బలంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అందుకే ఏ పాత్రనూ ప్రేక్షకుడు అంత తర్వగా మర్చిపోలేడు.
బాలిరెడ్డిగా జగపతిబాబును చాలా క్రూరంగా చూపించాడు. ఆయన కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా నటించాడు. ఈ సినిమాతో ఆయనకు మరో మంచి పాత్ర దొరికింది. నీలాంబరిగా సునీల్ ఆకట్టుకుంటాడు. ప్రతి పాత్రా కథను ముందుకు నడిపించేందుకు దోహదపడేదే. తమన్ అందించిన సంగీతం బాగుంది. రం.. రుధిరం.., పెనివిటి పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ విషయంలో తమన్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నత స్థాయిలో ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలం. ఎన్టీఆర్‌ను చూపించిన తీరు, యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటాయి. సినిమా నిడివి కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. త్రివిక్రమ్ తన శైలికి భిన్నమైన కథను ఎంచుకుని, దానికి తనదైన భావోద్వేగాలతో కూడిన మాటలను అందించడం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.
బలాలు
+ ఎన్టీఆర్ నటన
+ త్రివిక్రమ్ సంభాషణలు
+ గుండెను హత్తుకునే సన్నివేశాలు
బలహీనతలు
- త్రివిక్రమ్ మార్కు వినోదం లేకపోవడం
చివరిగా: ఎన్టీఆర్-త్రివిక్రమ్‌లు ఆవిష్కరించిన భావోద్వేగాల ‘అరవింద సమేత’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
చిత్రం: అరవింద సమేత వీరరాఘవ
నటీనటులు: ఎన్టీఆర్, పూజాహెగ్డే, జగపతిబాబు, సునీల్, నాగబాబు, ఈషారెబ్బ, సుప్రియ పాతక్, నవీన్ చంద్ర, దేవయాని, సితార, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
ఎడిటర్: నవీన్ నూలి
స్టంట్స్: రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
దర్శకత్వం: త్రివిక్రమ్
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
విడుదల తేదీ: 11-10-2018
0 comments:
Post a Comment