Thursday, 29 November 2018

‘2.ఓ’ మూవీ రివ్యూ


నాలుగేళ్ల పాటు శ్ర‌మించి, ఏకంగా అయిదు వంద‌ల కోట్ల‌కుపైనే పెట్టుబ‌డి పెట్టి ఓ సినిమా తీశారంటే.. ఆ ప్ర‌య‌త్నానికి, సాహ‌సానికీ వీర‌తాళ్లు వేయాల్సిందే. అది ర‌జ‌నీకాంత్ ‌సినిమా. అందులోనూ సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కితే... ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది? అందుకే రోబో 2.ఓ పై అన్ని న‌మ్మ‌కాలు పెంచుకున్నారు సినీ అభిమానులు. త‌ర‌చూ వాయిదా ప‌డుతూ వ‌స్తున్నా.. ర‌జ‌నీ అభిమానులు ఎక్క‌డా నిరుత్సాహ ప‌డ‌కుండా ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్ష‌ణ ఫ‌లించింది. 2.ఓ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ర‌జ‌నీ - శంక‌ర్ స్థాయికి త‌గ్గ‌ట్టు సాగిందా? రోబోతో పోలిస్తే 2.ఓలో ఉన్న ప్ర‌త్యేక‌త‌లేంటి?

క‌థేంటంటే: భూమ్మీద‌ ఉన్న‌ట్టుండి అంద‌రి సెల్‌ఫోన్లూ మాయ‌మైపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్‌ని చీల్చుకుంటూ మ‌రీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గ్ర‌హిస్తారు. ఇంత‌లో సెల్‌ఫోన్‌ల‌న్నీ అమ‌ర్చుకున్న ఓ ప‌క్షి ఆకార‌పు రూపం న‌గ‌రంలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దింపాల‌ని భావిస్తారు. వశీక‌ర్ (ర‌జ‌నీకాంత్‌) ఆ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతం అవుతాడు. అలా చిట్టి మ‌ళ్లీ రంగ ప్ర‌వేశం చేసి - అత్యంత బ‌ల‌మైన ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్‌)ని ఎలా ఎదుర్కొంది? అస‌లు ఆ ప‌క్షిరాజు క‌థేమిటి? అనేది తెలియాలంటే 2.ఓ చూడాల్సిందే.

ఎలా ఉందంటే: శంక‌ర్ ఎప్పుడూ సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్న‌తంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విష‌యాన్నే ఎంచుకోవ‌డం మ‌రింత క‌లిసొచ్చింది. 2.ఓ విష‌యంలో ఆయ‌న సెల్‌ఫోన్‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు. సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, భ‌విష్య‌త్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుందో... ఈ సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టారు. వాటి చుట్టూ ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ క‌థ అల్లారు. ప్ర‌ధ‌మార్ధంలో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్ర‌వేశం చేస్తాడో.. అప్పుడు ఓ ర‌స‌వత్త‌ర‌మైన పోరు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. ప‌క్షిరాజుగా అక్ష‌య్ ని చూపించ‌డంతో విశ్రాంతి కార్డు ప‌డుతుంది.


ద్వితీయార్ధం మొత్తం చిట్టి - ప‌క్షిరాజుల ఆధిప‌త్య పోరే చూపించారు. అస‌లు ప‌క్షిరాజు క‌థేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విష‌యాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృద‌యాన్ని హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు. అస‌లు ఈ సినిమాలో ఎమోష‌న్ పండింది అంటే... ఈ ఒక్క ఎపిసోడ్ లోనే. ప‌తాక స‌న్నివేశాల్ని విజువ‌ల్‌గా ఓ స్థాయిలోకి తీసుకెళ్లాడు శంక‌ర్‌. కొన్ని స‌న్నివేశాలు రోబోలో చూసిన‌ట్టే అనిపిస్తుంటాయి. రోబో నాటి ప్ర‌భావం శంక‌ర్‌లో ఇంకా పోలేదేమో అనే అనుమానం క‌లుగుతుంటుంది. ప్ర‌చార చిత్రాలు చూసిన‌వాళ్ల‌కు ఈ సినిమా క‌థ‌పై ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డి ఉంటుంది. వాటికి లోబ‌డే సినిమా ఉంటుంది.
క‌థ ప‌రంగా.. ద‌ర్శ‌కుడు అద్భుతాలేం చూపించ‌లేదు. త‌న దృష్టంతా ఈ సినిమాని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డంపైనే సాగింది. కొన్ని స‌న్నివేశాల్లో గ్రాఫిక్స్ అబ్బుర‌ప‌రుస్తాయి. ఇంకొన్ని చోట్ల సాదాసీదాగా సాగాయి. అయితే... శంక‌ర్ ఈసారి ఎమోష‌న‌ల్ గా ఈ క‌థ‌ని మ‌ల‌చలేక‌పోయాడు. భావోద్వేగాల‌న్ని బ‌లంగా రాబ‌ట్టుకొనే శంక‌ర్‌... ఆ విష‌యంలో కాస్త లోటు చేశాడేమో అనిపిస్తుంది. రోబోలో ఐశ్వ‌ర్య రాయ్ లాంటి స్టార్ నాయిక ఉండ‌డంతో ఆ పాత్ర‌కు వెయిటేజ్ ఇవ్వ‌గ‌లిగాడు. ఈసారి... ఐష్ లోని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది.

ఎవ‌రెలా చేశారంటే: ఈ వ‌య‌సులోనూ ఇలాంటి విన్యాసాలు చేయ‌డం, జోరుగా స్టెప్పులేయ‌డం ర‌జ‌నీకే చెల్లింది. త‌న ఈజ్‌కి, స్టైల్‌కి మ‌రోసారి సెల్యూట్ చేయాల్సిందే. అయితే కొన్ని చోట్ల డూప్‌తో లాగించేసిన‌ట్టు అర్థ‌మైపోతుంటుంది. పైగా.. ఏది విజువ‌ల్ ఎఫెక్ట్స్ ర‌జ‌నీకాంతో, ఏది నిజ‌మైన ర‌జ‌నీనో తెలీక క‌న్‌ఫ్యూజ్ అవుతారు. అక్ష‌య్ ప‌రిస్థితీ అంతే. ఆయ‌న ప‌క్షిరాజుగా క‌నిపించింది ఎక్కువ‌. నిజ‌మైన రూపాన్ని చూసే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా వ‌చ్చింది. అయితే... అక్ష‌య్ గెట‌ప్ బాగుంది. అమీజాక్స‌న్‌ని మిన‌హాయిస్తే... తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిన న‌టీన‌టులెవ‌రూ క‌నిపించ‌రు. శంక‌ర్ ఈ సారి క‌థ‌ని ర‌జ‌నీ - అక్ష‌య్‌ల పోరాటం మ‌ధ్యే తిప్ప‌డంతో మిగిలిన పాత్ర‌లు తేలిపోయాయి.
సాంకేతికంగా ఉన్న‌తంగా ఉందీ చిత్రం. విజువ‌ల్ ఎఫెక్ట్స్ మ‌రీ హాలీవుడ్ స్థాయిలో లేవు గానీ... మ‌న తెలుగు ప్రేక్ష‌కుల్ని మాత్రం అబ్బుర‌ప‌రుస్తాయి. త్రీడీలో చూడ‌గ‌లిగితే... ఆ ఎఫెక్ట్స్ మ‌రింత బాగుంటాయి. పాట‌లేం విన‌సొంపుగా లేవు. కాక‌పోతే ఆర్‌.ఆర్‌లో రెహ‌మాన్ మార్క్ క‌నిపించింది. ప్ర‌తీసారీ బ‌ల‌మైన క‌థ‌ని ఎంచుకుంటూ సినిమాలు తీసే శంక‌ర్ ఈసారి కేవ‌లం టెక్నాల‌జీకే పెద్ద పీట వేశాడు. దాంతో తెరంతా భారీ హంగుల‌తో మెరిసిపోతుంటుంది. కానీ.. భావోద్వేగాలు ఇంకాస్త పండాల్సింది.

బ‌లాలు
+ చిట్టి - ప‌క్షిరాజు పోరాటాలు
+ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌
+ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ 
+ భారీద‌నం

బ‌ల‌హీన‌త‌లు
- షాకింగ్ ఎలిమెంట్స్ త‌క్కువ‌ 
- ఎమోష‌న్స్‌లో ఇంకాస్త బలం ఉండాల్సింది. 
చివ‌రిగా: దిస్‌ ఈజ్‌ చిట్టీ.. రీలోడెడ్‌ వెర్షన్‌ 2.ఓ

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


2 comments:

  1. #2.0
    Artificial Intelligence(🤖) VS Spiritual Energy(👻)
    Full Of Entertainment 👌
    Sarcastic Chitty! 😍
    Film of awesomeness..
    1st day 1st show 1st ticket 😋
    A Must see movie in 3D 😎

    ReplyDelete

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top