కాకినాడ- : ‘మీ ముందున్నది ముగ్గురే ముగ్గురు. చంద్రబాబు, జగన్, పవన్‌కల్యాణ్. తొమ్మిది నెలలు జైల్లో ఉన్న జగన్ ముఖ్యమంత్రి కావాలా? ప్రత్యేక హోదా కావాలని, వద్దని.. మోదీ మంచోడని, దుర్మార్గుడని ఊసరవెల్లిలా మాటలు మార్చే చంద్రబాబు కావాలా? కుల, మత రాజకీయాలకు అతీతంగా అవినీతి రహిత పాలన తెచ్చే జనసేన కావాలా? 2019 ఎన్నికల్లో మీరే తేల్చాలి’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని జి.మామిడాడ గ్రామంలో బహిరంగ సభ, కాకినాడలో కార్యకర్తల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘జగన్‌లా నా వద్ద రూ.వేల కోట్లు లేవు. చంద్రబాబు, లోకేష్‌లా యంత్రాంగమూ లేదు. నాకు జనసైనికులే అండ’ అని పేర్కొన్నారు. 18నుంచి 25ఏళ్ల వారి ఓట్లు తీసేస్తున్నారని, ప్రతి వారం మీ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు.
‘ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చా. నన్ను సెల్ఫీలకు పరిమితం చేయకండి’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. ఫొటోలు తీయించుకోడానికి రాజకీయాల్లోకి రాలేదని, మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకే వచ్చానని వివరించారు. కాకినాడ జీ-కన్వెన్షన్ హాల్‌లో కార్యకర్తల సమావేశంలో పలువురు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫొటోలతో మార్పు వస్తుందా? పోరాటాలతో వస్తుందా?అని ప్రశ్నించారు. ఈ పోరాటమే తెదేపాను ఓడిస్తుందని, జనసేనను గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. నాపై వ్యక్తిగత అంశాలు మాట్లాడుతున్న జగన్ తెలంగాణ వారిని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రులను దోపిడీదారులుగా చిత్రించారని, ఇవన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబులాంటి నాయకుల విధానాల్లోని పొరపాట్లేనని విమర్శించారు. జగన్ త్యాగాలు చేసి జైలుకు వెళ్లలేదన్నారు. ‘ఆంధ్రులను తిడుతుంటే, తరిమేస్తుంటే జగన్ మాట్లాడరు. నాపై మాత్రం వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులు పోతాయనే భయమా? నాకలాంటి భయాల్లేవు’ అని పవన్ అన్నారు. అవసరమైతే ఓటమిని తట్టుకోగలను గానీ.. ఆశయాన్ని వదులుకోబోనని వివరించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మోదీ, రాహుల్‌ను కూడా ప్రశ్నిస్తానన్నారు.
జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు: జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు దొమ్మేటి వెంకటేశ్వర్లు (తాళ్లరేవు), రాజా అశోక్‌బాబు (తుని)లు పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. కొందరు మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
0 comments:
Post a Comment