Latest

Sunday, 16 December 2018

పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ .......


తెలుగు సినిమా చందమామ... కాజల్‌. చందమామ ఎప్పుడూ ఎలా అందంగా కనిపిస్తుందో అలాగే కాజల్‌ ఏళ్లు గడుస్తున్నా సోయగాలతో ప్రేక్షకుల్ని మురిపిస్తోంది. ఎన్నిసార్లు తెరపై చూసినా మళ్లీ మళ్లీ చూడముద్దేస్తోంది. ఎంతమంది కొత్త కథానాయికలు దూసుకొస్తున్నా... కాజల్‌ వారికి దీటుగా అవకాశాల్ని అందుకొంటూ తన కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఇటీవలే ‘కవచం’తో అలరించిన ఆమె... కమల్‌హాసన్‌తో కలిసి ‘భారతీయుడు2’లో నటించే అవకాశం అందుకొంది. ఈ సందర్భంగా కాజల్‌ తన సినీ ప్రయాణం గురించీ, చిన్ననాటి ముచ్చట్ల, చెల్లితో గొడవలు, అమ్మానాన్నల క్రమశిక్షణ గురించి మనసు విప్పింది. 
* మీ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనేదైనా గుర్తుకొస్తుంటుందా? 
కథానాయికగా ఈ స్థాయికి వచ్చానంటే దాని వెనకాల చాలా సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటినీ మలుపులుగానే భావిస్తా. జీవితంలో తొలిసారి నాపైన నాకు బలంగా నమ్మకం వచ్చిందంటే అది పాఠశాలలో చదువుకొంటున్నప్పుడు వేసిన నాటకం తర్వాతే. అందులో బోథా, ఫిడేల్‌ అని రెండు ప్రధాన పాత్రలుంటాయి. నాకేమో బోథా అనే అమ్మాయి పాత్ర చేయాలని ఉండేది. కానీ అబ్బాయిల్లాగా నా తలకట్టు ఉండటం, టామ్‌బాయ్‌లాగా కనిపిస్తుండడంతో నన్ను ఫిడేల్‌ పాత్ర చేయమన్నారు. అది చేయడం నాకు ఇష్టం లేదన్నా నువ్వు చేయగలవని నాకే ఇచ్చారు. ఆ పాత్రకే తొలి బహుమతి వచ్చింది. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చదువుకొనేటప్పుడే నాటకాలతో ఇంత అనుబంధం ఉన్నా... నటనని ఒక వృత్తిగా ఎంచుకోవాలనే ఆలోచన ఎప్పుడూ వచ్చేది కాదు.
* మరి అప్పట్లో పెద్దయ్యాక ఏం చేయాలనిపించేది? 
నా స్నేహితులు, చుట్టు పక్కల పిల్లలు పెద్దయ్యాక నేనదవుతాను, ఇదవుతానని మాట్లాడుకొనేవాళ్లు. నాకేమో ఓ స్పష్టత ఉండేది కాదు. నేనేం చేయాలో అర్థం కాక గందరగోళానికి గురయ్యేదాన్ని. అప్పుడు ఏ పని చేస్తే నాకు బాగుంటుందో తెలుసుకోవడానికి ముందు ఏదో ఒకటి చేసి చూడాలనిపించింది. అప్పుడే ఇంటర్న్‌షిప్‌ మొదలుపెట్టా. మొదట ప్రకటనలు, ప్రజాసంబంధాలకి సంబంధించిన ఓ సంస్థలో చేరా. అలా పదహారేళ్ల నుంచే పనిచేయడం అలవాటైంది. కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి వేసవిలోనూ ఓ ఉద్యోగం వెదుక్కునేదాన్ని. నా స్నేహితులు టూర్లకి వెళ్లిపోతే... నేను ఉద్యోగాలు వెదుక్కోవడంలో బిజీ అయ్యేదాన్ని. ఏ పనినైతే ఇష్టంగా చేస్తానో తెలియడానికే అలా చేశా. డిగ్రీ చివరి యేడాదిలో ఉన్నప్పుడే లోరియల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చేరా. కాలేజీ అయ్యాక కూడా పది నెలలు పనిచేశా. ఆ తర్వాత ఎంబీఏలో చేరా. అప్పుడే సినిమా అవకాశాలొచ్చాయి. .
* సెట్‌లో కాజల్‌కీ, ఇంట్లో కాజల్‌కీ తేడా ఏంటి? 
ఇద్దరికీ పోలికలే ఉండవు. సెట్‌లో ప్యాకప్‌ చెప్పాక నేను నాదైన ప్రపంచంలోకి వెళ్లిపోతుంటా. నా అభిరుచికి తగ్గట్టుగా గడుపుతుంటా. మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతోంది? ఇతరత్రా రంగాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటా. కుటుంబం, స్నేహితులతో గడుపుతా. ఆ సమయంలో వృత్తికి సంబంధించిన ఏ విషయాలూ గుర్తుకు రావంతే.
*  సినిమా ప్రయాణం వల్ల వ్యక్తిగతంగా ఏదైనా కోల్పోయానని బాధపడ్డారా? 
బాధపడటం అంటూ ఏమీ లేదు. కొన్నిసార్లు తప్పకుండా కుటుంబంతోనూ, స్నేహితులతోనూ గడపాల్సిన సందర్భాల్లో కూడా పనులుంటాయి. ఆ క్షణంలో ‘అరే... వెళ్లలేకపోయానే’ అనిపిస్తుంటుంది. పెళ్లిళ్లు, ఇంట్లో ఇతరత్రా వేడుకలు చాలా మిస్‌ అవుతుంటాం. ఇప్పుడైతే నా చెల్లెలు కొడుకు ఇషాన్‌ని చాలా చాలా మిస్‌ అవుతున్నా. సెట్‌లో కాస్త ఖాళీ దొరికితే ఫేస్‌టైమ్‌లోకి వెళ్లి తనతోనే ముచ్చట్లు.
* మీరు, మీ చెల్లెలు నిషా చిన్నప్పుడు బాగా గొడవ పడేవారట కదా? 
మా ఇద్దరి మధ్య వయసు పరంగా పెద్దగా తేడా లేదు. దాదాపుగా కవల పిల్లల్లాగే పెరిగాం. దాంతో మా మధ్య ఎప్పుడూ గొడవలే. దుస్తులు, పుస్తకాలు, టీవీ రిమోట్‌, ఏసీ రిమోట్‌.. ఇలా అన్నిటి గురించీ గొడవ పడేవాళ్లం. జుట్టు పట్టుకొని కొట్టుకునేవాళ్లం. తనకి పెళ్లి అయిన తర్వాతే మా ఇద్దరి మధ్య ఫైటింగులు ఆగిపోయాయి (నవ్వుతూ).
* నిషా పెళ్లి తర్వాత, మీపైన పెళ్లి విషయంలో ఒత్తిడి పెరిగిపోయుంటుంది కదా? 
నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉందండీ, కానీ అబ్బాయి దొరకడం లేదు. అందుకే పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేశాను. మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి. అది ప్రేమ పెళ్లైనా కావొచ్చు, పెద్దలు కుదిర్చిన పెళ్లైనా కావొచ్చు.
* కథానాయికగా యాభై సినిమాల మైలురాయి చేరుకొన్నాక జోరు పెంచారు. సెంచరీ కొట్టాలనా? 
ఎన్ని సినిమాలు చేశానని నేనెప్పుడూ లెక్కలేసుకోను. ‘నేనే రాజు నేనే మంత్రి’ చేస్తున్నప్పుడు ఎవరో గుర్తు చేస్తే  అది నా యాభయ్యో సినిమా అని తెలిసింది. మొదట్నుంచీ నచ్చిన కథలు చేసుకొంటూ, ఒక ప్రవాహంలాగా అలా ముందుకు వెళ్లిపోతున్నా.
*  హిందీలో రాణించలేకపోయాననే అసంతృప్తి ఏమైనా ఉందా? 
దక్షిణాదిలోకంటే మంచి పాత్రలు హిందీ నుంచి వచ్చినప్పుడే చేస్తుంటా. హిందీ కెరీర్‌, తెలుగు కెరీర్‌ అని వేర్వేరుగా చూడను. అంతా నా ప్రయాణమే కదా.
* ఓ వేడుకలో ఛోటా కె.నాయుడు మిమ్మల్ని ముద్దుపెట్టుకొన్నారు. ఈ సంఘటనపై మీ మాటేంటి? 
నన్ను కూడా షాక్‌కి గురిచేసిన విషయం అది (నవ్వుతూ). ఛోటా కె.నాయుడు నాకు ఎప్పట్నుంచో పరిచయం. ఆయన మనసులో చెడు అభిప్రాయాలంటూ ఉండవు. దాన్ని వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. వేదిక దిగాక ఛోటా ‘సారీ నాన్నా... నువ్వు ఇబ్బంది పడుంటే’ అన్నారు.

ఖాళీ దొరికతే లండన్‌ సెలవులు, విహారం అనగానే నాకు గుర్తుకొచ్చేది లండన్‌. అక్కడ నాకు సన్నిహిత మిత్రులు, కజిన్స్‌ ఉన్నారు. అక్కడ వాతావరణం బాగా నచ్చుతుంది. ఖాళీ దొరికినప్పుడు అక్కడికే వెళుతుంటా. రెస్టారెంట్లకి వెళ్లి కొత్త రుచుల్ని ఆస్వాదిస్తుంటా. 
వాళ్ల అనుభవాలను తెలుసుకుంటా 
చిత్ర పరిశ్రమలో అందరితోనూ స్నేహంగా ఉంటా. అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ల అనుభవాల్ని తెలుసుకొంటూ, వాళ్ల క్రమశిక్షణని గమనిస్తుంటా. యువ కథానాయకులతో కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ల ఉత్సాహం కట్టిపడేస్తుంటుంది

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top