దేశం మొత్తం మీద ఎన్నికల హంగామా నడుస్తోంది. రాజకీయాలు, పొత్తులు, ఓట్లు.. వీటి గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో రాజకీయ నేపథ్యంలో ఓ చిత్రం రావడం, అది కూడా ఓట్ల గురించి.. ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించడం.. ఆసక్తి కలిగించే విషయమే. కరెంట్ అఫైర్స్‌కి ప్రేక్షకులంతా.. సులభంగా కనెక్ట్ అయిపోతుంటారు. అందుకే ‘ఆపరేషన్ 2019’ పైనా దృష్టి పడింది. ‘ఆపరేషన్ దుర్యోధన’ తర్వాత.. శ్రీకాంత్ చేసిన పూర్తి రాజకీయ చిత్రమిది. దాంతో ఈసారి శ్రీకాంత్ కొత్తగా ఏం చెప్పాడన్న ఉత్సుకత నెలకొంది. ఏ రాజకీయ పార్టీలపై సెటైర్లు వేశాడో తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది. మరి ‘ఆపరేషన్ 2019’ లక్ష్యమేంటి? వర్తమాన రాజకీయాలకు ఈ చిత్రం ఎంత వరకూ అద్దం పట్టింది?
కథేంటంటే: ఉమా శంకర్ (శ్రీకాంత్) ఓ రైతు బిడ్డ. కష్టపడి చదివి విదేశాలకు వెళ్లి స్థిరపడతాడు. బాగా సంపాదిస్తాడు. తన సంపాదనతో రైతుల్ని ఆదుకోవాలనుకుంటాడు. కానీ, స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఉమా శంకర్ సాయం రైతులకు అందకుండా చేస్తాడు. రాజకీయాల్లో దిగి మార్పు తీసుకొస్తే తప్ప పరిష్కారం దొరకదని భావించి... ఆ ప్రాంతంలో ప్రజాసేవకు అంకితమైన నారాయణమూర్తి (శివకృష్ణ)ని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడతాడు. ఆయన గెలుపు కోసం కష్టపడతాడు. కానీ కులం, ధనం, ఉత్తుత్తి వాగ్ధానాల ప్రలోభాలకు లొంగిపోయిన ఓటర్లు... నారాయణమూర్తిని ఓడిస్తారు. దాంతో ఉమా శంకర్ ఓ నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? ఆ నిర్ణయం వల్ల ఉమా శంకర్ జీవితంలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ వచ్చిన మార్పేంటి? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రమిది. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకూ రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. మధ్యమధ్యలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. ఓ ఎన్‌ఆర్‌ఐ రైతుల్ని ఆదుకోవడానికి ఈ దేశానికి వస్తే... తనకు ఎలాంటి అడ్డంకులు వస్తాయన్న పాయింట్‌తో కథ మొదలై... ఆ ఎన్‌ఆర్‌ఐ ఎమ్మెల్యేగా నిలిచి.. రాష్ట్ర రాజకీయాల్ని ఎలా తారు మారు చేశాడన్నంత వరకూ సినిమా సాగింది. ఈ కథలో, కథ నడకలో, కథానాయకుడి పాత్ర చిత్రణలో ‘ఆపరేషన్ దుర్యోధన’ ఛాయలు అడుగడుగునా కనిపిస్తాయి. ఓ విధంగా ఆ సినిమాకి ఇది రీమేక్ అనుకోవచ్చు. ప్రజలు ఉత్తుత్తి వాగ్ధానాలకు ఎలా ప్రలోభ పడిపోతున్నారు, నోట్లకు ఓట్లు ఎలా అమ్ముకుంటున్నారు. కుల, మత ప్రభావాలు ఎంత ఉన్నాయి? అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. అన్నీ, అందరికీ తెలిసిన అంశాలే.. ప్రతీ రాజకీయ చిత్రంలోనూ కనిపించే విషయాలే. కాబట్టి... కథ, కథనాల్లో కొత్తదనం కనిపించదు.
కానీ.. వాటికి సంబంధించిన సెటైర్లు మాత్రం బాగానే పేలాయి. ఓటు అమ్ముకుంటే, ఓటు వేయకపోతే.. ప్రజా నేతల్ని సమస్యలు తీర్చమని అడిగే హక్కులేదన్న సందేశాన్ని ఇచ్చిందీ చిత్రం. అయితే. .. చాలా విషయాలు నేల విడిచి సాము చేస్తుంటాయి. ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్థిలా.. ఎన్నికల వాగ్ధానాలు చేయడం, వాటిని అమలు పరచడం.. ఇవన్నీ కాస్త అతిగా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినా... దానికో పద్ధతి ఉంటుంది. మనసులో అనుకున్న ప్రతీదీ తెరపై చూపించేయాలనుకున్నాడు. దాంతో లాజిక్కులు మిస్ అయ్యాయి. సునీల్ పాట ఎందుకు వస్తుందో అర్థం కాదు. చివర్లో.. మంచు మనోజ్ వచ్చి ఓ ఫైట్ చేసి వెళ్లాడు. పాటకు, ఫైటుకూ మినహాయిస్తే.. ఆ పాత్రలు ఈ కథకు చేసిన ఉపయోగం ఏమీ లేదు.
ఎవరెలా చేశారంటే: శ్రీకాంత్ 125వ చిత్రమిది. ఆ ప్రత్యేకత ఏమీ కథలో, ఆయన పాత్రలో కనిపించవు. అనుభవజ్ఞుడైన నటుడు కాబట్టి.. తన పాత్ర వరకూ సాఫీగా చేసుకుంటూ వెళ్లాడు. సినిమా అంతా సీరియస్‌గానే కనిపించాడు. డైలాగులూ తక్కువే. కథానాయికలుగా కనిపించిన ఇద్దరివీ ప్రాధాన్యం లేని పాత్రలే. కోట శ్రీనివాసరావులాంటి అనుభవజ్ఞుడికి ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదు. సుమన్‌దీ అతిథి పాత్రే అనుకోవాలి. సినిమా అంతా శ్రీకాంత్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే మిగిలిన పాత్రలేవీ ఎలివేట్ అవ్వలేదు. విలన్ పాత్రతో సహా. పాటలు ఒకే అనిపించినా.. కథాగమనానికి అడ్డు తగులుతాయి. మాటల్లో ఇంకాస్త పదును ఉండాల్సింది. దర్శకుడు ఓ బలమైన విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఆలోచన మంచిదే. కానీ, ఆచరణలో కాస్త తడబడ్డాడు.
బలాలు
+ శ్రీకాంత్ నటన
+ కథా నేపథ్యం
బలహీనతలు
- ఆకట్టుకోని కథనం
- రొటీన్ విషయాలు
చివరిగా: ఆపరేషన్ దుర్యోధనని మళ్లీ చూపించే.. ‘ఆపరేషన్ 2019’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
0 comments:
Post a Comment