హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య పెరగనుంది. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచారు. ఆ తర్వాత కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. 2016లో దసరా నుంచి వీటిని ప్రారంభించారు. ఇటీవల శాసనసభ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ పలు ప్రచార సభల్లో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని తాజాగా ఆదేశించారు. దీంతో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటవనున్నాయి. వీటితో కలిపి జిల్లాల సంఖ్య 33కి చేరుతుంది. నారాయణపేట రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ములుగు కోసం దీర్ఘకాలిక ఆందోళన జరిగింది. కొత్తగా ఏర్పడే ములుగు జిల్లాకు సమ్మక సారలమ్మ పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం 69 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా కోరుట్లకు ఆమోదం తెలపడంతో వీటిసంఖ్య 70కి పెరగనుంది. మరోవైపు 438 మండలాలు ఉండగా కొత్తగా మరో ఆరు కలుస్తుండటంతో వీటి సంఖ్య 444కి చేరుతుంది. ఇవిగాక మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటయ్యే వీలుంది.
ఎప్పటి నుంచి ప్రారంభం?
కొత్త జిల్లాలు, డివిజన్లు మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చారు. సరిహద్దుల విభజన, మార్పులు, చేర్పులు నోటిఫికేషన్ జారీ ఇతర ప్రక్రియ కోసం కనీసం పక్షం రోజుల సమయం అవసరం. వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటిలోపు ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే ఫిబ్రవరి నెల వరకూ వేచి ఉండాలి. అప్పుడూ కాకుంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత అంటే మే నెలలోనే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ప్రారంభమయ్యే వీలుంది.
జోనల్ విధానంలో చేర్చాలి
ఇప్పటికే 31 జిల్లాలకు అనుగుణంగా పాలనావ్యవస్థ ఉంది. ట్రెజరీ కోడ్, రవాణా శాఖ కోడ్ నంబర్లు ఉన్నాయి. కొత్త జోనల్, బహుళ జోనల్ విధానం కింద 31 జిల్లాల కూర్పు జరిగింది. తాజాగా కొత్త జిల్లాలు కానున్న ములుగు, నారాయణపేటలను జోనల్ విధానంలో చేర్చాలి. ఇప్పటివరకూ జరిగే నియామకాలు 31 జిల్లాల ప్రాతిపదికనే ఉన్నాయి. కొత్త జిల్లాలు ఆమోదం పొందాక జరిగే ఉద్యోగ నియామకాల్లో వాటికి చోటు లభించే వీలుంది. ఈ రెండు జిల్లాలకు ప్రత్యేకంగా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలతో పాటు జిల్లా కార్యాలయాలు ఏర్పాటవుతాయి.
0 comments:
Post a Comment