‘మళ్లీ రావా’తో కాస్త ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించాడు సుమంత్. ఆ విజయంతో తనకు అవకాశాలూ పెరిగాయి. ఈనెలలోనే ‘సుబ్రహ్మణ్యపురం’ విడుదలైంది. ఇప్పుడు ‘ఇదం జగత్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన సినిమాలు వరుసగా వస్తున్నా కథలలో వైవిధ్యం చూపించడానికే ప్రయత్నిస్తున్నాడు. ఈసారి థ్రిల్లర్ కథని ఎంచుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో సుమంత్ ఏ మేరకు కొత్తగా కనిపించాడు?
కథేంటంటే: నిశిత్ (సుమంత్) ఉద్యోగం లేక ఖాళీగా ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు. చివరికి ఫ్రీ లాన్స్ రిపోర్టర్‌గా తనకు తానే ఓ పని వెదుక్కుంటాడు. రాత్రి వేళలో నగరంలో జరిగే ప్రమాదాల్ని కెమెరాతో రికార్డ్ చేసి, ఛానళ్లకు అమ్ముకుని జీవనోపాధి పొందుతుంటాడు. ఆ క్రమంలో మహతి (అంజుకురియన్) పరిచయం అవుతుంది. తానెవరో, ఏం చేస్తాడో అన్న విషయాల్ని మహతి దగ్గర దాచి, ఆమెతో స్నేహం చేస్తుంటాడు నిశిత్. ఓసారి రోడ్డుపై జరిగిన ఓ హత్యని తన కెమెరాలో బంధిస్తాడు. ఆ ఫుటేజ్‌తో డబ్బు సంపాదించాలనుకుంటాడు. అయితే.. ఆ ఫుటేజీనే తన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మహతిని తనకు దూరం చేస్తుంది. ఇంతకీ ఆ ఫుటేజ్‌లో ఏముంది? దాని వల్ల ఎవరి జీవితాలు ఏ రకంగా మలుపు తిరిగాయి? అనేదే కథ.
ఎలా ఉందంటే: కథాంశం, కథానాయకుడి పాత్ర చిత్రణ పరంగా చూస్తే... ఈ పాయింట్‌లో వైవిధ్యం కనిపిస్తుంది. కథానాయకుడు రాత్రిపూట.. నగరంలో సంచరించడం, నేరాలూ ఘోరాలను తన కెమెరాలో బంధించడం ఇదంతా కొత్తదనానికి స్కోప్ ఇచ్చింది. అయితే ఆలోచన బాగుంటే సరిపోదు. దాన్ని సరైన రీతిలో ఆచరణలో పెట్టాలి. కథలో వీలైనన్ని ఉత్కంఠ భరితమైన సన్నివేశాల్ని మేళవించాలి. అయితే.. ఆ ప్రయత్నం ఎక్కడా జరిగినట్టు అనిపించదు. కథని ప్రారంభించిన విధానమే ఆసక్తిని రేకెత్తించేలా ఉండదు. టీవీ ఛానళ్లు ఫుటేజీని డబ్బులు పెట్టి కొంటారన్న విషయం కథకు అతికినట్లు అనిపించదు. అందులోనూ... రోడ్డుపై చచ్చిపడి ఉన్న శవం ఫుటేజీకి లక్షలు పోస్తారంటే ఎలా నమ్ముతారు..?
మర్డర్ జరిగిన ఫుటేజీ చుట్టూనే ద్వితీయార్ధం మొత్తం నడిపించాడు దర్శకుడు. అందులో ఎలాంటి ఉత్కంఠతకూ తావు లేకుండా చేశాడు. కథానాయకుడు, నాయికల ఘర్షణ కూడా అతకలేదు. హత్యకు సంబంధించిన కీలకమైన ఆధారం నిశిత్ దగ్గరే ఉందని, ప్రతినాయకుడికి తెలిసినా.. క్లైమాక్స్ వరకూ పట్టించుకోడు. చాలా విషయాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి. పతాక సన్నివేశాలు సైతం ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు. తాను అనుకున్నది నమ్మి అందుకోసం ఏమైనా చేసే పాత్ర కథానాయకుడిది. కనీసం ఆ క్యారెక్టరైజేషన్ అయినా ఎలాంటి గందరగోళం లేకుండా సూటిగా చెప్పాల్సింది. అలా చెప్పడంలో తడబడటంతో ఆ పాత్ర చిత్రణతోనే ముడి పడి ఉన్న కథ, సన్నివేశాలు పట్టు తప్పాయి.
ఎవరెలా చేశారంటే: సుమంత్‌తో సహా ఏ పాత్రధారినీ ఛాలెంజ్ చేసే సన్నివేశం ఈ సినిమాలో ఒక్కటీ రాలేదు. చాలా ఈజీగా చేసేశారంతా. సుమంత్‌కి ఇదో కొత్త తరహా పాత్ర. రెండు రకాల షేడ్స్ పలికించాడు. కథానాయికకు ఇదే తొలి సినిమా. నటనలో ఇంకాస్త పరిణితి కనిపించాయి. శివాజీరాజా, సత్య, ఆదిత్య ఇతర పాత్రల్లో కనిపించారు. వారి వారి పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికంగా ఈ సినిమా అంత ఉన్నతంగా ఏమీ లేదు. పాటలు, నేపథ్య సంగీతం రెండూ అంతంత మాత్రమే. బడ్జెట్ పరిమితులు స్పష్టంగా కనిపించాయి. దర్శకుడు అనుకున్న పాయింట్ బాగుంది. కానీ.. దాన్ని నిలబెట్టే సన్నివేశాలు, సంఘటనలు రాసుకోలేకపోయాడు. కథ, కథనాలు రెండూ నత్తనడక సాగాయి.
బలాలు
+ కథా నేపథ్యం
బలహీనతలు
- సన్నివేశాల్లో బలం లేకపోవడం
చివరిగా..: అంచనాలకు దూరంగా ‘ఇదం జగత్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
0 comments:
Post a Comment