మెదక్ జిల్లాకు చెందిన 15 మంది అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వ్యానులోని భక్తుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఖాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, హత్నూర మండలం మంగాపూర్ గ్రామాలకు చెందిన 15 మంది అయ్యప్ప భక్తులు 3 రోజుల క్రితం శబరిమల యాత్రకు వ్యానులో బయలుదేరారు. శనివారం స్వామిని దర్శించుకున్నారు. రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం ఉదయానికి రామేశ్వరం చేరుకున్నారు. అక్కడి రామనాథస్వామిని దర్శించుకున్నారు. అక్కణ్నుంచి బయలుదేరిన వీరి వాహనం మధ్యాహ్నం పుదుకోట్టై జిల్లా తిరుమయం వద్ద తిరుచ్చి-రామేశ్వరం రహదారిలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఢీకొన్న వేగం, తీవ్రతకు వ్యాను ముందుభాగం నుజ్జయింది. వ్యాను డ్రైవరు సహా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే పుదుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నా, ప్రాణాపాయం లేదని స్థానిక వైద్యులు తెలిపారు. కంటైనర్ తప్పుడు మార్గం(రాంగ్‌రూట్)లో ఎదురుగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
మృతులు వీరే
* కర్రె నాగరాజుగౌడ్ (28), జుర్రు మహేష్ (28), బోయిని కుమార్(22) - ఖాజీపేట
* అంబర్‌పేట కృష్ణ గౌడ్ (40), నక్క ఆంజనేయులు(45)- రెడ్డిపల్లి
* ప్రవీణ్‌గౌడ్(25), సురేశ్ (23)- చిన్నచింతకుంట
* అయ్యన్నగారి శ్యామ్ గౌడ్ (23), సాయి(26)- మంతూరు
* డ్రైవర్ సురేశ్(45)- హైదరాబాద్ నగరం బోయిన్‌పల్లి
క్షతగాత్రులు వీరే
* కర్రె నరేశ్ గౌడ్, దొంతి భూమయ్య, మచ్కూరి రాజు- ఖాజీపేట
* శ్రీశైలం-మంతూరు
* వెంకటేశ్వర్లు- హత్నూర మండలం మంగాపూర్
0 comments:
Post a Comment