Friday, 4 January 2019

త్వరలో 1500 ఉద్యోగాలు భర్తీ

 rjdigitaltoday

గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31లోపు నోటిఫికేషన్లు ఇచ్చామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. మొత్తం 21 నోటిఫికేషన్ల ద్వారా 3250 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్షల తేదీలతో పాటు ఖాళీల వివరాలను సైతం గతంలో కంటే భిన్నంగా క్యారీ ఫార్వర్డ్‌ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామని వివరించారు. ఈ నెలాఖరు లోపు 1500 ఉద్యోగాల భర్తీకి మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

త్వరగా దరఖాస్తు చేసుకోండి

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు 47,001 దరఖాస్తులు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఉద్యోగాలకు 16,130, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు 5411, హార్టికల్చర్‌ అధికారి ఉద్యోగాలకు 1307 దరఖాస్తులు అందాయని తెలిపారు. మిగతా నోటిఫికేషన్లకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తులకు గడువు ఉందని, ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలకు మొత్తం 56,621 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అభ్యర్థులు చివరి నిమిషంలో దరఖాస్తులు చేస్తుండటం వల్ల సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు ఎక్కువగా ఓటీపీఆర్‌ సంబంధిత ఇబ్బందులే వస్తున్నాయని, వారికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామన్నారు.

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Blogger Templates
Scroll To Top