Thursday, 7 February 2019

ఇంటర్‌ విద్యార్థినిపై కొబ్బరి బొండాల కత్తితో యువకుడి దాడి

శ్రద్ధగా చదువుకుని జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలనే ఆకాంక్ష ఆ బాలికది. ఆకర్షణనే ప్రేమనుకుని, దాన్ని గెలవడమే జీవిత ధ్యేయమనే భ్రమ ఆ కుర్రాడిది. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా సంఘర్షణ జరిగింది. ఆమె మాత్రం తను అనుకున్న లక్ష్యానికే కట్టుబడగా.. అతను ఉన్మాదిగా మారాడు. తన ప్రేమను కాదన్న యువతిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ఆమె ఆశలను చిదిమేసేందుకు యత్నించి.. తన భవిష్యత్తును తానే పాతాళంలోకి నెట్టేసుకున్నాడు. కన్నవారిని తీరని ఆవేదనకు గురిచేశాడు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ప్రేమోన్మాద ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రాణాపాయ స్థితిలో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా..నిందితుడు భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడ పోలీసులు..ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం.. బర్కత్‌పుర ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రైవేటు ఉద్యోగికి ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె (17) అదే ప్రాంతంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. వాళ్లింటి సమీపంలో ఉండే సి.భరత్‌ అలియాస్‌ సోను (20) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతున్నాడు.

మార్పు తేని హితబోధలు
కుమార్తె ఇచ్చిన సమాచారం మేరకు బాలిక తల్లిదండ్రులు యువకుడి కుటుంబసభ్యులను గతంలోనే హెచ్చరించారు. తర్వాత కూడా అతనిలో మార్పురాకపోగా, కొన్ని నెలలుగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. వాటిని భరించలేకపోతున్నానంటూ బాలిక చెప్పిన మీదట తల్లిదండ్రులు ఇటీవలే ‘షి’ బృందానికి ఫిర్యాదు చేశారు. వాళ్లు యువకుడికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. వేధింపులు ఆపాలని హెచ్చరించారు. అవేమీ అతనిలో మార్పు తేలేదు. ఆ పరిణామాల తర్వాత బాలికపై మరింత కక్ష పెంచుకున్న యువకుడు ఆమెకు హాని తలపెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు.

బస్తీవాసుల చొరవతో ఆసుపత్రికి
బాలిక ఆర్తనాదాలు విన్న బస్తీవాసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బాధితురాలి చెల్లెలు ఇచ్చిన సమాచారం మేరకు బాలిక బాబాయ్‌ అక్కడికి చేరుకున్నాడు. నెత్తుటి మడుగులో పడి ఉన్న బాధితురాలిని చేతుల మీదే ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న కాచిగూడ పోలీసులు 108లో మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావమైనందున బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, శ్వాస ఆడడం లేదని వైద్యులు తెలిపారు.

నిందితుడి అరెస్టు
బాలికపై పాశవికంగా దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘తన ప్రేమను అంగీకరించడం లేదని, తనతో మాట్లాడటం లేదన్న కక్షతోనే నిందితుడు బాలికపై దాడి చేశాడు. పరారీలో ఉన్న నిందితుణ్ని మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మూసీనది ఒడ్డున అదుపులోకి తీసుకున్నాం. కత్తిని అతని ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నాం. అతనిపై హత్యాయత్నం, పోక్సో-2012 చట్టం, అక్రమ ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశాం’ అని తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్‌రెడ్డి తెలిపారు. నిందితునికి ఎలాంటి నేరచరిత్ర లేదని, దాడి జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు అందుబాటులో లేవని వెల్లడించారు.


ఉరి తీయాలి: బాధితురాలి తండ్రి
తన కుమార్తెను వేధింపులకు గురిచేయడంతోపాటు కత్తితో దాడిచేసిన భరత్‌ను ఉరి తీయాలని బాధితురాలి తండ్రి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తానే హతమారుస్తానన్నారు. ‘వేధింపుల గురించి తన బిడ్డ మూడు నెలల క్రితమే చెప్పింది. వెంటనే అతని తల్లిదండుల దృష్టికి తీసుకెళ్లా. వాళ్లు పట్టించుకోని కారణంగానే భరత్‌ ఉన్మాదిలా వ్యవహరిస్తూ బిడ్డను చిత్రహింసలకు గురి చేశాడు. వేధింపులపై జనవరి 7న ఠాణాలో ఫిర్యాదు చేశాం. ఆ కక్షతోనే పాశవికంగా దాడి చేశాడు’’ అని విలేకర్లతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Blogger Templates
Scroll To Top