రాష్ట్రంలో టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను వీక్షించవచ్చు. కేబుల్ ఆపరేటర్ ఇష్టానుసారం కాకుండా చూడదలచిన ఛానళ్లకు చెల్లింపులు చేసి ప్రసారాలు పొందవచ్చు. నచ్చిన ఛానళ్లను ముందుగానే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేబుల్ టీవీ ప్రసారాల నూతన నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలతో మరోవైపు వినియోగదారులపై ఛార్జీల భారం భారీగా పెరగనుంది. కొత్త నిబంధనల మేరకు ప్రసార సంస్థలు, ఆపరేటర్లకు ప్రత్యేక విధివిధానాలు ఖరారు చేస్తూ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అవసరమైన ఏర్పాట్లు చేసింది. టీవీ ఛానల్ ప్యాకేజీ వివరాలను అందుబాటులో పెట్టింది. ఛానళ్ల ఎంపికలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఛానల్ ఎంపిక అప్లికేషన్ https://channel.trai.gov.in సిద్ధం చేసింది. ఈ ప్లాట్‌ఫారం ద్వారా వినియోగదారుడి కోరిక మేరకు ఎంపిక చేసిన ఛానళ్లకు అయ్యే ఖర్చు, తదితర వివరాలు తెలియనున్నాయి.
కనీస ఛార్జి రూ.130...
అత్యధిక నాణ్యత కలిగిన (హెచ్‌డీ), సాధారణ నాణ్యత కలిగిన (ఎస్‌డీ) ప్రసారాలకు వేర్వేరు ధరలు నిర్ణయించారు. వివిధ భాషలతో కలిపి ఉచిత ఛానళ్లు ప్రస్తుతం 534 అందుబాటులో ఉన్నాయి. ఇందులో 25 దూరదర్శన్ ఛానళ్లు తప్పనిసరి. అయితే తెలుగు నుంచి యాదాద్రి ఛానల్‌కు మాత్రం చోటు దక్కలేదు. డీడీ ఛానళ్లతో పాటు ప్రజలు తమ కోరిక మేరకు 100 వరకు ఛానళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఛానళ్లకు కలిపి మొత్తం రూ.130 తో పాటు జీఎస్‌టీ చెల్లించాలి. ఒకవేళ ఉచితఛానళ్ల సంఖ్య పెంచుతూ వెళ్తే శ్లాబ్ మేరకు ధరలు పెరుగుతాయి. ప్రతి 25 ఛానళ్ల శ్లాబ్‌కు రూ.20 భారం మోయాల్సిందే. ఇప్పటి వరకు రూ.200లకు అటూఇటుగా స్థానిక ఎంఎస్‌వోలు కేబుల్ టీవీ ప్రసారాలు చేసేవారు. ఇక నుంచి అన్ని ఛానళ్లను పొందాలంటే ప్రజలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది.
పేఛానళ్లు మీ ఇష్టం...
ప్రజాదరణలో పే ఛానళ్లదే హవా. సీరియళ్లు, సినిమాలు, కార్యక్రమాలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ సంస్థలు ఛానళ్లను ఇప్పటికే పే ఛానళ్లుగా మార్చాయి. వినియోగదారుడు ఆ ఛానళ్లను వీక్షించాలంటే నగదు చెల్లించాలి. ఇక నుంచి తాము వీక్షించదలచిన మీడియా సంస్థ ఛానళ్లను ప్యాకేజీ కింద లేదా విడివిడిగా తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది. ఒకవేళ ఛానల్ నచ్చకుంటే తొలగించుకునేందుకు వీలుంది. పే ఛానళ్ల ధరలు సాధారణంగా రూ.0.50 నుంచి రూ.19 వరకు ఉన్నాయి. కొన్ని సంస్థలు రూ.50 ఆపైన కూడా పేర్కొన్నాయి. ధరలు తక్కువగా ఉన్నప్పటికీ... చూడదలచిన ఛానల్‌ను ముందుగానే ఎంపిక చేసుకుంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. చూసేవి, చూడనివి అన్నీ ఎంపిక చేసుకుంటే ఛానల్ ఫీజులతో పాటు పన్ను మొత్తం కలిపితే భారం భారీగా పెరగనుంది.
ప్యాకేజీలో వారిని గడువు వరకు కొనసాగించాలి..
డీటీహెచ్ ఆపరేటర్లు ఏడాది ప్యాకేజీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్యాకేజీలు పునరుద్ధరించే గడువు వరకు ప్రస్తుత ప్యాకేజీలోనే కొనసాగించాలంటూ ట్రాయ్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రాంతీయ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు డీటీహెచ్ సంస్థలు ఇష్టమైన ఛానళ్లతో కూడిన ప్యాకేజీ ఎంచుకోవాలంటూ సంక్షిప్త సందేశాలు పంపిస్తోంది. జనవరి 31 వరకు వినియోగదారులు ప్యాకేజీకి బదులుగా తనకు ఇష్టమైన ఛానళ్లతో కూడిన సొంత ప్యాకేజీని ఎంపిక చేసుకునేందుకు ముందుకు వస్తే... ధరల్లో వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయాలని ట్రాయ్ తెలిపింది.
0 comments:
Post a Comment