టాలీవుడ్‌కు వరుస సక్సెస్‌లు అందించిన సూపర్ హిట్ జానర్ కామెడీ హారర్. ఒకప్పుడు ఈ జానర్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. అయితే ఇటీవల టాలీవుడ్‌లో ఈ తరహా సినిమాల హడావిడి కాస్త తగ్గింది. కొంత గ్యాప్ తరువాత ఇదే జానర్‌లో మరోసారి వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెంకటలక్ష్మీ ప్రేక్షకులను ఏమేరకు నవ్వించింది..? ఎంత వరకు భయపెట్టింది..?
కథ :
చంటిగాడు (ప్రవీణ్), పండుగాడు (మధు నందన్) బెల్లంపల్లి అనే ఊళ్లో పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాళ్లు. ఊళ్లో జనాలను ఇబ్బంది పెడుతూ ఆనందపడే చంటి , పండు.. ఒక్క శేఖర్ (రామ్ కార్తీక్) మాట మాత్రం వింటారు. వాళ్లకు ఏ సమస్య వచ్చిన శేఖరే కాపాడుతుంటాడు. కానీ శేఖర్, గౌరీ(పూజితా పొన్నాడ)ల ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన పని కారణంగా శేఖర్ కూడా వారిని అసహ్యించుకుంటాడు. అదే సమయంలో బెల్లంపల్లి ఊరికి స్కూల్ టీజర్‌గా వెంకటలక్ష్మి( రాయ్ లక్ష్మీ) వస్తుంది. బస్ దిగగానే సాయం చేయమని చంటి, పండులను అడుగుతుంది. ఆమె అందంపై ఆశపడ్డ చంటి, పండు వెంకటలక్ష్మికి వసతి ఏర్పాటు చేయటంతో పాటు అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే సరికి వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది. అసలు దెయ్యంగా వచ్చిన వెంకటలక్ష్మీ ఎవరు..? వెంకటలక్ష్మి.. చంటి, పండులకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఈ కథతో నాగంపేట వీరారెడ్డి(పంకజ్ కేసరి)కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ప్రధాన పాత్రలో నటించిన రాయ్ లక్ష్మి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. భయపెట్టే సన్నివేశాలతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ప్రవీణ్, మధునందన్‌లు తమ పరిధి మేరకు బాగానే నటించారు. అయితే పూర్తిస్థాయిలో తమ కామెడీ టైమింగ్‌ను చూపించే అవకాశం మాత్రం దక్కలేదు. హీరో రామ్ కార్తీక్ మంచి నటన కనబరిచాడు. పూజితా పొన్నాడ గ్లామర్ షోలో రాయ్ లక్ష్మితో పోటీ పడింది. ఇతర పాత్రల్లో అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు కిశోర్, తరువాత అదే స్థాయిలో కథను నడిపించలేకపోయాడు. కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, హారర్ రెండూ వర్క్ అవుట్ కాలేదు. ఎక్కువగా అడల్ట్ కామెడీ మీద దృష్టి పెట్టి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన దర్శకుడు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కథా కథనాలు కూడా ఆసక్తికరంగా సాగకపోవటం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. వెంకటలక్ష్మి దెయ్యం అని రివీల్ అయిన తరువాత కథ ఆసక్తికరంగా మారుతుందని భావించిన ప్రేక్షకుడిని మరింత నిరాశకు గురిచేశాడు దర్శకుడు. భయపెట్టే సన్నివేశాలకు స్కోప్ ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ద్వితీయార్థం కూడా సాదాసీదా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ మరీ నాటకీయంగా ముగియటం ఆడియన్స్‌కు రుచించటం కష్టమే. సినిమాలో కాస్త పాజిటివ్‌గా అనిపించే అంశం హరి గౌర సంగీతం. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
0 comments:
Post a Comment