ఉన్నత విద్యార్హత లేదా? అయినా కేంద్రప్రభుత్వ కొలువు కొట్టొచ్చు! ఎంపికైతే ఏటా వేతనంలో పెరుగుదల, మూడేళ్లకోసారి పదోన్నతి.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా త్వరలో విడుదలవుతున్న ఎంటీఎస్ నోటిఫికేషన్ ఈ అవకాశం కల్పిస్తోంది. రాతపరీక్షలో నెగ్గినవారిని నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా తీసుకుంటారు. కేంద్రప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల దైనందిన కార్యకలాపాలు సజావుగా సాగటానికి తోడ్పడే ‘సి’ గ్రూపు ఉద్యోగంతో కెరియర్‌ను ఆరంభించవచ్చు! రెండు పేపర్ల రాతపరీక్ష ఎంతో కీలకమైనది కాబట్టి, ముందస్తుగానే సన్నద్ధత ఆరంభించటం చాలా అవసరం!
పదోతరగతి (లేదా) మెట్రిక్యులేషన్ సమానమైన విద్యార్హత ఉన్న 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతీయువకులు మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.15,000 నుంచి రూ.20,000 నెల జీతం లభిస్తుంది. ఈ కొలువులకు ఎంపికైనవారు ఆఫీసుల్లో పనిచేస్తున్న అధికారులకు సహాయంగా పనిచేయాలి. ఆఫీసుకు వచ్చేవారిని తనిఖీ చేయటం, ఫోన్‌లో సమాచారం ఇవ్వడం, పోస్టులు, పార్సిల్స్ పంపించడం, బుక్స్ లేదా ఫైల్స్‌ను భద్రపరచడం, కార్యాలయానికి వచ్చే లేఖలు, కవర్లను ఆయా అధికారులకు చేరవేయటం, బుక్‌వర్క్ లేదా సిస్టమ్ వర్క్ చేయటం, పై అధికారులు చేసే పనులకు అనుగుణంగా వారికి సహాయపడటం.. వీరి విధులు.
ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ/ పీహెచ్ వారికి 10 సంవత్సరాలు వయఃపరిమితిలో మినహాయింపు ఉంది. అభ్యర్థులు విద్య, వ్యక్తిగత వివరాలతో దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ www.ssconline.nic.in లో కచ్చితమైన, సరైన సమాచారం మాత్రమే పొందుపరచాలి.
ఎంపిక ప్రక్రియ
ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1 రాతపరీక్ష. నాలుగు విభాగాల నుంచి 150 ప్రశ్నలను ఇస్తారు. 150 మార్కులు. 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి.
* జనరల్ ఇంగ్లిష్ విభాగంలోనివి మినహా మిగతా ప్రశ్నలన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
* రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. కాబట్టి, సమాధానం తెలిసిన ప్రశ్నలనే ఎంచుకోవాలి. ప్రయోగాత్మక పనులు చేయకూడదు.
పేపర్-1లో అర్హత మార్కులు పొందిన అభ్యర్థులను పేపర్-2 డిస్క్రిప్టివ్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
మంచి మెటీరియల్ సేకరణ, ఎక్కువ మాదిరి ప్రశ్నపత్రాల సాధన, జనరల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు ఎక్కువ చేయడం, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి ఎక్కువసార్లు రివిజన్ చేయడం మీద అభ్యర్థుల మార్కులు ఆధారపడతాయి. సబ్జెక్టుల వారీగా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సన్నద్ధత కొనసాగించాలి.
సబ్జెక్టులవారీగా..
1) ఇంగ్లిష్ లాంగ్వేజ్: రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ నుంచి 6- 8 ప్రశ్నలు వస్తాయి. యాంటనిమ్స్, సిననిమ్స్, వర్డ్ స్పెల్లింగ్ కరెక్షన్, ఇడియమ్స్-ఫ్రేజెస్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్, యాక్టివ్ వాయిస్- పాసివ్ వాయిస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, సెంటెన్స్ కరెక్షన్ నుంచి గ్రూప్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి అంశం నుంచి 2 (లేదా) 3 ప్రశ్నలు వస్తాయి.
పదాలకు సంబంధించిన ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించాలంటే రోజువారీ ఇంగ్లిష్ దినపత్రిల్లోని ఎడిటోరియళ్లను చదివితే మంచిది. ఇంగ్లిష్ వ్యాకరణానికి సంబంధించి WREN & MARTIN గ్రామర్ పుస్తకం సాయపడుతుంది.
2) జనరల్ ఇంటలిజెన్స్: ఈ ప్రశ్నలు సులువుగా చేసేలా ఉంటాయి. పదాలు, నంబర్లు ఒక లాజిక్ ఆధారంగా ఉంటాయి. అదే క్రమంలో ఆలోచించి సమాధానాన్ని గుర్తుపట్టాలి. నాన్ వెర్బల్ అంశాల నుంచి పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్స్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. లాజికల్ రీజనింగ్ నుంచి నంబర్ సిరీస్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్ ప్రశ్నలు వస్తాయి. క్రిటికల్ రీజనింగ్ నుంచి సిలాజిజమ్, కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్ ప్రశ్నలు వస్తాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్, రక్తసంబంధాల నుంచి కూడా ప్రశ్నలుంటాయి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయడం ద్వారా జనరల్ ఇంటలిజెన్స్ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: నంబర్ సిస్టమ్స్ నుంచి +, -, x, / సింబల్ ఆపరేషన్స్ బాడ్‌మాస్ పద్ధతి ద్వారా పూర్తి చేయడం, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్‌ను ఉపయోగించి సమాధానాలు గుర్తించడం ఉంటాయి. శాతాలు, నిష్పత్తి-అనుపాతం, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ-బారువడ్డీ, వ్యాపార భాగస్వామ్యం, కాలం-దూరం, కాలం-పని అంశాల నుంచి 8 - 10 ప్రశ్నలు వస్తాయి. డేటా అనాలిసిస్ నుంచి వెన్ డయాగ్రమ్, పై-చార్ట్, టేబుల్, బార్-చార్ట్, లైన్-గ్రాఫ్‌ల నుంచి 3 ప్రశ్నలు వస్తాయి.
ఆల్జీబ్రాలో సర్డ్స్, ఇండిసెస్, లీనియర్/ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్లేన్ జామెట్రీ, కో-ఆర్డినేట్ జామెట్రీ; త్రికోణమితి, ఎత్తులు- దూరాలు, ట్రిగనామెట్రిక్ రేషియో, కాంప్లిమెంటరీ యాంగిల్స్; సర్కిల్, త్రిభుజం, స్పియర్, హెమీస్పియర్, కోన్, పిరమిడ్, క్వాడ్రిలేటర్, పాలిగన్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యమైన ఫార్ములాలను పట్టిక రూపంలో రాసుకుని, సింప్లిఫికేషన్ మీద దృష్టిపెట్టాలి. తక్కువ సమయంలో ఎక్కువ సరైన సమాధానాలను గుర్తించే వీలుంటుంది.
4) జనరల్ అవేర్‌నెస్: సమాజంలో చుట్టూ జరుగుతున్న అంశాలు, భౌగోళిక, శాస్త్రీయ-సాంకేతిక, సాంఘిక, సైన్స్-టెక్నాలజీ, ఎకానమీ, రాజకీయ (జాతీయ, అంతర్జాతీయ), చారిత్రక సంబంధ అంశాలు, వాక్సిన్లు, కేంద్రప్రభుత్వ పథకాలు, ఇతర దేశాలతో ఒప్పందాలు, తదితర అంశాల నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. రోజువారీ దినపత్రిక చదువుతూ ఉంటే కనీసం 15 నుంచి 20 ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించగలుగుతారు.
పేపర్-2 కూడా ఇప్పటినుంచే..
డిస్క్రిప్టివ్ పరీక్షకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే సన్నద్ధమవడం మంచిది.
ఈ పేపర్-2లో ఎస్సే, ప్రెస్సీ రైటింగ్, లెటర్ రైటింగ్, అప్లికేషన్ పూర్తి చేయడం వంటి డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఇస్తారు. 50 మార్కులు కేటాయించారు. ఇచ్చిన ప్రశ్నలకు 30 నిమిషాల వ్యవధిలో సమాధానాలు రాయాలి. తెలుగు/ ఇంగ్లిష్/ హిందీ భాషల్లో ఏదైనా ఒక మాధ్యమంలో సమాధానాలు రాయాలి.
4- 5 పేరాల్లో ఉన్న సమాచారాన్ని కుదించి 1 (లేదా) 2 పేరాల్లో రాయడం అలవాటు చేసుకోవాలి. లెటర్, అప్లికేషన్ రైటింగ్‌లలో పదాలను తప్పులు లేకుండా రాయాలి. సరైన రీతిలో వ్యాకరణాన్ని ఉపయోగించాలి. విరామచిహ్నాలను (, .) ఎక్కడ, ఎలా వాడాలో క్షుణ్ణంగా తెలిసుండాలి. చిన్న, పెద్ద అక్షరాలను ఎక్కడ ఉపయోగించాలన్న విషయంపైనా అవగాహన ఉండాలి.
పేపర్-2లో అర్హత సాధించినవారికి, మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు.
0 comments:
Post a Comment