Latest

Monday, 24 December 2018

మంచిర్యాల జిల్లాలో పరువు హత్య


పేగుబంధం కన్నా పరువుకే ప్రాధాన్యమిచ్చారు. మమకారం కన్నా మాట పట్టింపులకే విలువిచ్చారు. వేరే కులం వాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఒకే కారణంతో కన్న బిడ్డపై కసి పెంచుకున్నారు. అదును చూసి ఆటవికంగా దాడి చేశారు. ఒంటరిని చేసి కర్రలతో కొట్టి చంపారు.  కాల్చి బూడిద చేసి అమానవీయతను, ఆటవిక నీతిని చాటారు. తమ కన్న ప్రేమకు.. తమ బిడ్డ ప్రేమకు ఒకేసారి సమాధి కట్టారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య, ఎర్రగడ్డలో మాధవి ఘటనలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న వేళ వాటిని మించిన ఘాతుకమిది. సభ్య సమాజం నిర్ఘాంతపోయే ఈ ఉదంతం మంచిర్యాల జిల్లాలో శనివారం రాత్రి జరిగింది.మంచిర్యాల జిల్లాలో పరువు హత్య 
జన్నారం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన అయ్యోరు లక్ష్మణ్‌, అదే గ్రామానికి చెందిన పిండి అనూరాధ(22) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్లిద్దరూ ఈ నెల 3న హైదరాబాద్‌ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి అజ్ఞాతంగా జీవిస్తున్నారు. శనివారం ఉదయం స్వగ్రామానికి వచ్చారు.
అత్తింట్లో ఉండగా.. లాక్కెళ్లి మరీ అమానుషం 
 manchiryala jilla paruvu hathya

విషయం తెలుసుకున్న అనూరాధ తండ్రి సత్తన్న, తల్లి లక్ష్మి, అన్నయ్య, మరికొందరు బంధువులు శనివారం రాత్రి లక్ష్మణ్‌ ఇంటికి వెళ్లారు. ఇంట్లో జొరబడి కుమార్తెను ఈడ్చుకుంటూ వెళ్లారు. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం మల్లాపూర్‌ సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని కాల్చివేసి, బూడిదను సమీపంలోని వాగులో కలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు.మంచిర్యాల జిల్లాలో పరువు హత్య 
అదే రోజు రాత్రి 11 గంటలకు లక్ష్మణ్‌ జన్నారం ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు గ్రామానికి వెళ్లి విచారించారు. సత్తన్న ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు. ‘ఉదయానికల్లా ఘోరం వెలుగుచూసిందని, 
అనుమానితులను విచారిస్తున్నామని, 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని’ మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు తెలిపారు.

‘‘నా పేరు అనూరాధ. మా ఊరు కలమడుగు. నేను లక్ష్మణ్‌ అనే వ్యక్తిని ప్రేమించా. ఈ విషయం ఆరు నెలల క్రితం మా ఇంట్లో చెప్పా. పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశా. మా వాళ్లు ఒప్పుకోలేదు. పైగా నాతోనే అతనిపై తప్పుడు కేసు పెట్టించారు. నేను అతన్ని మర్చిపోలేకపోతున్నా. ఇంట్లోంచి వెళ్లిపోయి అతన్నే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. అలా వెళ్లే మార్గంలోగానీ, వెళ్లిన తరువాత గానీ మా ఇద్దరికీ ఏదైనా హాని జరిగితే మా అమ్మానాన్న, గ్రామ సర్పంచిదే బాధ్యత. మాకేదైనా సమస్య వస్తే ఈ వీడియో ఆధారంగా మమ్మల్ని రక్షించాలని పోలీసులకు మనవి. దయచేసి మమ్మల్ని కాపాడండి.’’

శనివారం రాత్రి పరువు హత్యకు గురైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు  గ్రామానికి చెందిన అనూరాధ అక్టోబరు 24న స్వీయ  వీడియోలో పేర్కొన్న వివరాలివి. ఆమె భయపడినట్టే కన్న వాళ్లే  ఆమెను అతి కిరాతకంగా కొట్టి చంపారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక  మాధ్యమాల్లో సంచలనమైంది.

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top