Friday, 28 June 2019

బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ......

కొన్ని సినిమాలు టైటిల్‌తోనే మనసులు లాగేస్తాయి. ‘బ్రోచేవారెవరురా’ టైటిల్‌ ఆ కోవకే చెందుతుంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనంటూ చిత్ర బృందం బాగా ప్రచారం చేసింది. ఈ సినిమాను ఆడపిల్లల కోసమే ఒప్పుకొన్నానని శ్రీ విష్ణు ఒకానొక సందర్భంలో చెప్పారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్న ఈ సినిమాలో అంతగా ఏముంది? చూద్దాం.


కథేంటంటే: మిత్ర(నివేదా థామస్‌)కు భరతనాట్యం అంటే ఇష్టం. చిన్నప్పుడే అమ్మానాన్నవిడిపోతారు. దీంతో తల్లి దగ్గర పెరుగుతుంది. ఆమె చనిపోవడంతో ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరకు వచ్చి ఉంటుంది. మిత్ర తండ్రి కాలేజ్‌ ప్రిన్స్‌పల్‌. దీంతో అదేకాలేజ్‌లో మిత్ర ఇంటర్‌లో చేరుతుంది. అయితే, చదువంటే  అస్సలు ఇష్టం ఉండదు. మరోపక్క తండ్రి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. అలాంటి సమయంలో ముగ్గురు యువకులు ఫ్రెండ్స్‌ అవుతారు. అందులో రాహుల్‌ (శ్రీవిష్ణు) చాలా అల్లరి కుర్రాడు. చదువంటే అతనికీ ఇష్టం ఉండదు. తండ్రి క్రమశిక్షణ తట్టుకోలేక ఇల్లు వదలి పారిపోవాలనుకుంటుంది మిత్ర. దీంతో డబ్బుల కోసం ఈ నలుగురు కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడతారు. మిత్రను కిడ్నాప్‌ చేసి రూ.8లక్షలు డిమాండ్‌ చేస్తారు. ఆ చిన్న పొరపాటు వల్ల వీళ్ల జీవితాలు ఎలా తారుమారు అయ్యాయి? ఎవరెన్ని కష్టాలు పడాల్సి వచ్చింది? వాటి నుంచి ఎలా బయటపడ్డారన్నదే కథ. 


ఎలా ఉందంటే: ఇదొక కిడ్నాప్‌ డ్రామా. వాళ్లకు వాళ్లే కిడ్నాప్‌ అయ్యి, డబ్బు వసూలు చేసుకునే కథలు చాలా వచ్చాయి. ‘దొంగాట’ ఆ కోవలోకి చెందినదే. కానీ, ఈ చిత్రం వాటి కన్నాకాస్త భిన్నంగా ఉంటుంది. ఒక పక్క వినోదాన్ని పంచుతూ, మరోవైపు కథలో కొత్త మలుపులకు చోటిస్తూ, చివర్లో ఈ కాలం అమ్మాయిలకు చెప్పాల్సిన ఒక మంచి మాటను చెప్పారు. దర్శకుడు కథను వినోదాత్మకంగా మొదలు పెట్టాడు. కాలేజ్‌లో క్వశ్చన్‌ పేపర్లు దొంగిలించే సన్నివేశం ప్రేక్షకులను హాయిగా నవ్విస్తుంది. కిడ్నాప్‌ డ్రామా, అందుకోసం వేసిన స్కెచ్‌లు చాలా సరదాగా అనిపిస్తాయి. ఈ కిడ్నాప్‌ డ్రామాను ఒక దర్శకుడి కథకు, ముడిపెట్టడం కూడా తమాషాగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ప్రధానమైన చిత్రమిది. 

తొలి సగంలో చూపించిన కొన్ని సన్నివేశాలకు, ద్వితీయార్ధంలోని కీలక సన్నివేశాలకు ముడి పెట్టాడు దర్శకుడు. అవన్నీ కథలో కీలకం. ప్రథమార్ధం ఎంత సరదాగా సాగుతుందో, ద్వితీయార్ధం అంత ఉత్కంఠ కలిగిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ద్వితీయార్ధం తెరపై చూపించడం కత్తిమీద సాములాంటిది. దర్శకుడికి ఇక్కడే పూర్తి మార్కులు పడతాయి. కథనం ఉత్కంఠత కలిగిస్తూనే, వినోదపు పాళ్లు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. రెండు కథల్ని ముడి పెట్టిన విధానం బాగుంది. 

ఎవరెలా చేశారంటే: శ్రీ విష్ణు చాలా చలాకీగా నటించాడు. అల్లరి పిల్లాడిగా అతని నటన ఆకట్టుకుంటుంది. నివేదా థామస్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ద్వితీయార్ధంలో ఆమె పాత్రను కట్టేసినప్పటికీ తొలి సగంలో తను కూడా ఉత్సాహంగా కనిపించింది. సత్య, నివేదా పేతురాజ్‌లది మరో ట్రాక్‌. అది కూడా కథలో భాగమై ఉండటం వల్ల ఈ రెండు పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. సత్య చాలా సహజంగా నటించాడు. స్నేహితులుగా కనిపించిన ప్రియదర్శిని, రాహుల్‌ రామకృష్ణ ఈ సినిమాకు కావాల్సిన టైం పాస్‌ అందించారు. అమాయకపు ఎస్సైగా హర్షవర్థన్‌ నటన మెప్పిస్తుంది. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ప్రతీ నటుడు తన పాత్రకు న్యాయం చేశాడు. 

సాంకేతికంగా.. విశాల్‌ భరద్వాజ్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో మిళితం అయిపోయి సాగాయి. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. స్క్రీన్‌ప్లేలో మలుపులు గమ్మత్తుగా ఉన్నాయి. సినిమా అంతా ఒకే పంథాలో సాగడం అంత తేలికైన విషయం కాదు. ఏ సన్నివేశాన్నీ వృథా కాకుండా ప్రతి పాత్రనీ ఉపయోగించుకుంటూ చిత్రాన్ని చాలా ఆహ్లాదకరంగా మలిచాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చిత్రం: బ్రోచేవారెవరురా
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, శివాజీ రాజా తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
కూర్పు: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
సమర్పణ: సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాతలు: విజయ్‌ కుమార్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
విడుదల తేదీ: 28-06-2019

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Blogger Templates
Scroll To Top